మహిళా సమస్యలపై ఐక్య పోరాటాలు: మల్లు లక్ష్మి

తెలంగాణ సాయుధ పోరాట వీరనారుల స్ఫూర్తితో మహిళా సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేపడతామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి మహిళలు భూస్వామ్య, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పురుషులతో సమానంగా పోరాడారని తెలిపారు. నాటి పోరాట స్ఫూర్తితో మహిళలు ఎదుర్కొంటున్న హింస, వివక్ష, ఆర్థిక భారంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.



