చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం జరిగే అవకాశం
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామ శివారులో రోడ్డు కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద గుంత ఉండటంతో రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, పెను ప్రమాదం జరగకముందే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.



